నాకు ద‌క్కిన గొప్ప వ‌రం వ‌ర‌ల‌క్ష్మి : విశాల్

SMTV Desk 2018-05-14 15:39:19  tamil hero vishal, varalakshmi, mr.chandramouli audio launch,

చెన్నై, మే 14 : త‌మిళ హీరో విశాల్ న‌డిగ‌ర్ సంఘం కార్య‌ద‌ర్శిగా, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా విశాల్ బాధ్యతాయుత ప‌ద‌వుల‌ను నిర్వ‌హిస్తున్నాడు. ఆయన ప్రముఖ నటుడు, రాజకీయవేత్త అయిన శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ప్రేమించుకుంటున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. ఖండించలేదు. కాని వీరిద్దరూ కలసి తరచుగా బయట కనిపిస్తుంటారు. తాజాగా జ‌రిగిన "మిస్టర్ చంద్ర‌మౌళి" సినిమా ఆడియో వేడుక‌కు విశాల్‌, వ‌రల‌క్ష్మి హాజ‌ర‌య్యారు. అంతేకాదు పక్కపక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. అయితే ఇటీవల విశాల్ ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడతూ.. నా జీవితంలో స్నేహితుల‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మ‌న‌లోని లోపాల‌ను తెలిపేది, స‌రిదిద్దేది వారే అన్నారు. అంతేకాకుండా "నాకు ద‌క్కిన గొప్ప వ‌రం వ‌ర‌ల‌క్ష్మి. నాకు 8 ఏళ్లుగా వరలక్ష్మి తెలుసు. ఆమె నా జీవితంలో ముఖ్య‌మైన వ్య‌క్తి. నా లోపాల‌ను స‌వ‌రించి న‌న్ను ప్రోత్స‌హించిన ముఖ్య వ్య‌క్తి. నాకు సంబంధించిన అన్ని విష‌యాలూ ఆమెతో పంచుకుంటాను. ఆమెలో ఆత్మ‌విశ్వాసం చాలా ఎక్కువ‌. ఆమె త‌ప్ప‌కుండా రాజ‌కీయాల్లోకి రావాలి" అంటూ చెప్పుకొచ్చాడు.