అవార్డుల ప్రధానోత్సవం వివాస్పదం..

SMTV Desk 2018-05-04 10:50:56  natioanal awards, president, ram nath kovindh, delhi vignyan bhavan.

న్యూఢిల్లీ, మే 4 : దేశ రాజధాని ఢిల్లీలోని విగ్యాన్‌ భవన్‌లో జరిగిన జాతీయ అవార్డులు ప్రధానోత్సవం వివాస్పదంగా మారింది. ఇప్పటివరకూ జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలన్నింటిలో చివరి వరకు రాష్ట్రపతి పాల్గొనడం ఆనవాయితీగా వచ్చింది. కాని దానిని తొలిసారి మార్చి.. మొత్తం 141 అవార్డుల్లో కేవలం 11 అవార్డులనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందించారు. మిగతా అన్ని అవార్డులను కేంద్ర సమాచార- ప్రసారశాఖ మంత్రి స్మృతీఇరానీ, సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్ చేతుల మీదుగా అందించడాన్ని కళాకారులు తీవ్రంగా తప్పుబట్టారు. జీవితంలో ఒకసారి వచ్చే ఇలాంటి అరుదైన కార్యక్రమాన్ని తమను చిన్నబుచ్చడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని ప్రకటించి పలువురు బహిష్కరించారు. దీనిపై 120 మంది కళాకారులు తమ సంతకాలతో కూడిన నిరసన లేఖను రాష్ట్రపతికి పంపారు. అందులో "అవార్డులకు ఎంపిక కావడంతో మా శ్రమకు ప్రభుత్వం నుంచి తగిన గౌరవం లభించిందని సంతోషించాం. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకునే అరుదైన క్షణాలకోసం అంతా ఎదురుచూశాం. 64ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాన్ని రాత్రికిరాత్రే మార్చేయడం దురదృష్టకరం. అలాంటి అవకాశం జీవితంలో ఒకసారి వస్తుంటుంది. మా కష్టాన్ని గౌరవించడానికి బదులు కించపరుస్తున్నట్లు భావిస్తున్నాం. అందుకని మా అసంతృప్తిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం" అని రాష్ట్రపతికి పంపిన లేఖలో పేర్కొన్నారు.