అమెరికా వెళ్లాలనుకునే వారికి తీపి కబురు!!

SMTV Desk 2017-07-05 15:50:26  indian, peples, good, news, in, american

వాషింగ్టన్, జూలై 05 : ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసి పది రోజులు కూడా గడవకముందే భారత్-అమెరికా చర్చల సందర్భంగా తీసుకున్న నిర్ణయాల్లో అప్పుడే ఒకటి అమలులోకి రానుంది. భారతీయులు అమెరికాలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేయడం కోసం భారత్-అమెరికా మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్టులో ఎక్కువగా తనిఖీలు చేయకుండా తొందరగా తమ దేశంలోకి రానివ్వడం కోసం అమెరికా ‘కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్స్‌ ప్రొటెక్షన్‌’ విభాగం ‘గ్లోబల్‌ ఎంట్రీ ప్రోగ్రామ్‌’ అనే పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా వెళితే ఎక్కువగా ఇబ్బందులు ఉండవని భారత రాయబారి నవ్‌తేజ్ శర్ణా తెలియజేశారు. "గ్లోబల్‌ ఎంట్రీ ప్రోగ్రామ్‌"లో చేరిన వారు అమెరికాలో కొన్ని ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో దిగినప్పుడు వారిని మిగతా ప్రయాణికుల్లా తనిఖీ చేయరు. అంతేకాకుండా పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి ఇమిగ్రేషన్‌ అధికారులు వేసే ప్రశ్నలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. అలాంటి వారి కోసం "ఆటోమేటిక్‌ గ్లోబల్‌ ఎంట్రీ కియోస్క్‌"లు ఉంటాయి. కాని ఈ ప్రోగ్రామ్‌ ద్వారా వెళ్లాలనుకునేవారు ముందే అనుమతి తీసుకొని ఉండాలి. యూఎస్‌ వీసా అధికారులు వారిని క్షుణ్నంగా పరిశీలించి వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ నిర్వహించి ప్రమాదం ఉండదని నిర్ధారించుకున్నాక మాత్రమే ఆమోదముద్ర వేస్తారు. కాగా ఇప్పటివరకు కొలంబియా, యూకే, జర్మనీ, పనామా, సింగపూర్‌, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌, మెక్సికో దేశాలు మాత్రమే ఈ కార్యక్రమంలో ఉండగా, అందులో భారత్‌ కొత్తగా చేరింది.