దళితులను అణచివేసే కుట్ర: కడియం

SMTV Desk 2018-04-21 10:47:15  Sc, St, orders delute, Kadiyam Srihari, Dalits Reservation

హైదరాబాద్, ఏప్రిల్ 21‌: ఇటీవల కాలంలో రాజ్యాంగంతోపాటు దళితుల హక్కులపై దాడి జరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడిప్పుడే ఎస్సీ, ఎస్టీలు ఎదుగుతున్నారని, తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారని, ఇది తట్టుకోలేకే అణచివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ 127వ జయంతి ఉత్సవాలు శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఎంతో ముందుచూపుతో రాసిన రాజ్యాంగం నేటి సమకాలీన సమస్యలకు కూడా పరిష్కారం చూపుతోందన్నారు. ఆరు దశాబ్దాలపాటు పోరాటం జరిగినా అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు.దళితులు సంఘటితంగా ఉన్నప్పుడే పార్టీలు, ప్రభుత్వాలు భయపడతాయని అన్నారు. కేంద్రం ఇచ్చిన వివరాలను బట్టి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కోరలను సుప్రీంకోర్టు తీసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.