సీజేఐపై అభిశంసన అస్త్రం

SMTV Desk 2018-04-20 17:34:13  deepak mishra, impeachment process, cji, supreme court

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమయ్యాయి. కాంగ్రెస్ సారథ్యంలో ఏడు రాజకీయ పార్టీలు నేడు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకున్నాయి. తర్వాత వారంతా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ అయిన వెంకయ్యనాయుడును కలిసి నోటీసు అందించారు. సీజేఐపై అభిశంసనకు మద్దతు పలకాలని కాంగ్రెస్ మిగతా ప్రతిపక్ష పార్టీలను కోరింది. తొలుత తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే కూడా కాంగ్రెస్‌ డిమాండ్‌తో ఏకీభవించినప్పటికీ.. ప్రస్తుతం ఆయా పార్టీలు దూరంగానే ఉన్నాయి.ఈ ఉదయం కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ పార్టీల నేతలు పార్లమెంట్‌లోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఛాంబర్‌లో సమావేశమై సీజేఐపై అభిశంసన గురించి చర్చించారు. అభిశంసన అంటే.. >> సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి వీలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 124 సెక్షన్‌ కిందనే ఆయన్ని తొలగించవచ్చు. దుష్ప్రవర్తన, అసమర్ధత అనే కారణాలు చూపి ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. >> సుప్రీం కోర్టుకు చెందిన ఏ జడ్జీనైనా పదవీ విరమణకన్నా ముందే తొలగించాలంటే పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం నెగ్గితే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగిస్తారు. >> అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ఉభయ సభలు మూడింట రెండింతల మెజారిటీ తో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలి. ఈ మొత్తం ప్రక్రియను అభిశంసనగా వ్యవహరిస్తారు.