జోరందుకు౦టున్న పల్లెటూరి కథలు...!!

SMTV Desk 2018-04-19 19:20:49  ram charan, rangasthalam movie, director sukumar, 1980 movies.

హైదరాబాద్, ఏప్రిల్ 19 : మనం ఎంత గొప్పగా ఎదిగినా కాళ్ళు ఉండేవి నేలమీదే కదా.. ఇలాగే మన వేషభాషలు, ఆలోచనలు ఎంత పాశ్చాత్య పోకడలు పోయినా.. మనసు మూలాల్లో మట్టి వాసన ఎప్పుడూ గుభాలిస్తూనే ఉంటుంది. అలా గుభాలించిన నాడే మన మనుగడకి ఒక అర్ధం. ఆ మట్టి వాసన, మనకు పల్లెటూర్లు ప్రసాదించిన వరం. పల్లెటూర్ల నేపధ్యంలో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించకపోయినా మనసుకి హత్తుకుంటాయనేది మాత్రం నిర్వివాదాంశం. బహుశా పల్లెటూరి కథలతో డబ్బులు రావేమో అనే సందేహంతో పూర్తి పల్లెటూరి కథతో సినిమాలు తీయడానికి స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు సాహసించేవారు కాదు. అయితే అలాంటి ఆలోచనల్ని బ్రేక్ చేస్తూ దర్శకుడు సుకుమార్ -మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "రంగస్థలం" సినిమాతో కొత్త ట్రెండ్ సృష్టించారు. 1980 ల నాటి పల్లెటూరి కథని తీసుకొని ప్రేక్షకులకి విజువల్ ట్రీట్ ఇస్తూనే, కమర్షియల్ బ్లాక్ బాస్టర్ అందించారు. కొందరు ఆడియన్స్ అయితే ఈ సినిమా మా గతాన్ని గుర్తు చేసింది అన్నారు. ఇప్పుడు ఈ పంథాలోనే కొందరు దర్శకులు కథలు సిద్దం చేసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే ఇవి ఊహాగానాలేనా? లేక వాస్తవమా? అని తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే చాలా మంది సినీ ప్రేమికులకు జ్ఞాపకాల్లో ఉన్న పల్లెను మరోసారి తెరపై చూసుకునే అవకాశం వస్తుంది.