ఫుట్‌బాల్‌ కు రోనాల్డో... క్రికెట్ కు విరాట్

SMTV Desk 2018-04-17 12:06:47  virat kohli, dwayne bravo, indian cricket team captain, cristiano ronaldo

పుణె, ఏప్రిల్ 17: క్రిస్టినా రొనాల్డో... ఫుట్ బాల్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు. పాదరసంలా మైదానంలో కదులుతూ, తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కోహ్లి.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పుడు ఈ పేరు మారు మోగుతుంది. పరుగుల వీరుడిగా, టీమిండియా సారథిగా ఎన్నో రికార్డులను తన పాదాక్రాంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా.. అని అనుకుంటున్నారా..! తాజాగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథిగా వ్యవహరిస్తున్న కోహ్లిని ఫుట్‌బాల్‌ లెజండ్‌ క్రిస్టియనో రొనాల్డోతో పోల్చాడు. క్రికెట్‌ ప్రపంచంలో గల క్రిస్టియనో రొనాల్డో.. కోహ్లి అంటూ అభిప్రాయపడ్డాడు. "ఫుట్‌బాల్‌ క్రీడలో రొనాల్డొ ఎంత గొప్ప ఆటగాడో.. క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ అంత గొప్ప ఆటగాడు. కోహ్లి ప్రతిభావంతుడు. ఆట పట్ల అతడికున్న అంకితభావం అమోఘం. ఒక ఆటగాడిగా నేను అతని ఆటను ఆస్వాదిస్తాను. హ్యాట్సాఫ్‌ టూ విరాట్‌ కోహ్లి.. విజయాలు సాధించేందుకు నువ్వు అర్హుడివి’ అంటూ ప్రశంసలు కురిపించాడు. తన తమ్ముడు డారెన్‌తో పాటు కోహ్లి అండర్‌- 19 క్రికెట్‌ ఆడాడని, ఆ సమయంలో తన తమ్ముడికి ఆటలోని మెలకువలు నేర్పాల్సిందిగా, సూచనలు ఇవ్వాల్సిందిగా కోహ్లిని కోరానని బ్రావో చెప్పాడు.