తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల హవా..

SMTV Desk 2018-04-13 11:29:09  Inter results, Kadiyam Srihari Results Released, hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 13 ‌: తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటర్‌ బోర్డు కార్యాలయ ఆవరణలో ఉదయం 9 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 62.35 శాతం ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు తమ సత్తా నిరూపించుకున్నాయి. ట్రైబల్‌ వెల్ఫేర్‌ విద్యార్థులు 87 శాతం,సాంఘిక సంక్షేమ కళాశాలల్లో 86 శాతం, ప్రభుత్వ కాలేజీల్లో 70 శాతం, ప్రైవేట్‌ కాలేజీల్లో 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్లో 62.35 శాతం విద్యార్థులు ఉత్తర్ణత సాధించగా బాలికలు 69 శాతం, బాలురు 55.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. కాగా మేడ్చల్‌ జిల్లా ప్రథమ, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇంటర్‌ సెకండియర్‌లో 67.25 శాతం ఉత్తీర్ణులు కాగా బాలికలు 73.25, బాలురు 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కొమరం భీం జిల్లా తొలి స్థానంలో, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాల్లో నిలిచాయి, 40 శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్‌ జిల్లా అట్టడుగున నిలిచింది. యథావిధిగా ఈసారి కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు తెలిపారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఏప్రిల్ 20 వరకు గడువు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ కళాశాలల్లో జేఈఈ, నీట్‌లకు ప్రత్యేక కోచింగ్‌ ఇవ్వనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.