కావేరి ఎఫెక్ట్ : చెన్నైలో మ్యాచ్‌లు ఇక లేనట్లేనా..!

SMTV Desk 2018-04-11 19:00:29  cauvery issue, chennai super kings, ipl-11, cauvery management

చెన్నై, ఏప్రిల్ 11 : రెండేళ్ల నిషేధం తర్వాత వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోసం అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టు యెల్లో ఆర్మీ ఆడిన రెండు మ్యాచ్ ల్లో సూపర్ విజయాలను సాధించింది. ఇప్పుడు చెన్నై సొంతగడ్డపై జరిగే మ్యాచ్ లకు కావేరి ఎఫెక్ట్ తగిలింది. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసేవరకు చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరపవద్దని పలు రాజకీయ, ప్రజాసంఘాలు తీవ్రంగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరగాల్సిన మ్యాచ్ ఎన్నో ఆటంకాలు, వివాదాల నడుమ భారీ బందోబస్తు మధ్య జరిగింది. కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని తమిళనాడుకు చెందిన స్థానిక రాజకీయ నాయకులు మంగళవారం భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. చెపాక్‌ మైదానం ముందు వందల మంది కార్యకర్తలు ఆందోళన బాట చేపట్టారు. మ్యాచ్‌ జరుగుతుండగా మైదానంలో ఉన్న కొందరు ఆందోళనకారులు చెన్నై ఆటగాడు డుప్లెసిస్‌పై బూటు విసిరారు. కావేరీ నదీ జలాల వివాదం నానాటికీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ 2018 లో భాగంగా చెన్నైలో జరగాల్సిన మిగతా మ్యాచ్‌లను మరో చోట నిర్వహించాలని సీఎస్‌కే యాజమాన్యం, బీసీసీఐలు నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన వెలువడింది. చైన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లు హైదరాబాద్‌ లేదా వైజాగ్‌కు తరలించే అవకాశం ఉంది.