రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీల అనుబంధం

SMTV Desk 2017-07-03 12:02:31  Indian President Pranab Mukherjee and Prime Minister Modi, Son, Rashtrapati Bhavan,Jaitley, Statesman magazine

న్యూ ఢిల్లీ, జూలై 3 : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనను కొడుకులా చూసుకున్నారని, మూడేండ్లలో తామెప్పుడు కలుసుకున్న ఆయన తనపై ఆప్యాయత చూపని రోజు లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆదివారం రోజున జరిగిన కార్యక్రమంలో ప్రణబ్, ప్రధాని పాల్గొన్న సందర్భంగా మోదీ మనోభావాలను వ్యక్తపరిచారు. పిల్లల ఆరోగ్యంపై తండ్రి ఎలా శ్రద్ధ తీసుకుంటారో, అలానే నా ఆరోగ్యం పై కూడా రాష్ట్రపతి ప్రణబ్ శ్రద్ధ తీసుకున్నారు. మోదీజీ మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి కనీసం సగం రోజైనా విశ్రాంతి తీసుకోవాలని ప్రణబ్ ప్రధానికి చెప్పేవారు అంటూ మోదీ మనస్సు లోతుల్లో నుంచి అన్ని జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. తాను ఢిల్లీలో స్థిరపడేందుకు వచ్చిన సమయంలో ఉన్నత స్థాయిలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ నాకు మార్గనిర్దేశం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడం నా అదృష్టమని మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి సైతం ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటిని తమ వద్దనే పెట్టుకొని కలిసి పని చేశామని చెప్పారు. ఏ విషయంలోనైనా స్పష్టత కావాల్సి వస్తే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని అడిగేవాడినని ఆయన తెలిపారు. స్టేట్స్‌మన్ పత్రిక ప్రచురించిన ఈ పుస్తకంలోని చిత్రాలు చూస్తే తమ రాష్ట్రపతి చిన్న పిల్లాడిలా నవ్వగలడని ప్రజలు తెలుసుకుంటారు అని మోదీ చెప్పారు. ఈ మేరకు మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ ను నిలపగా, విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నాయకురాలు మీరాకుమార్ ఎన్నికల బరిలో ఉన్నారు.