దళితులకు కేంద్రం భరోసా ఇవ్వాలి: కేసీఆర్

SMTV Desk 2018-04-03 16:00:25  Bharat Bandh, Dalitstelangana cm kcr, SC ST atrocity case, supreme court

హైదరాబాద్‌, ఏప్రిల్ 3: భారత్ బంద్ సందర్భంగా దళితులపై వివిధ రాష్ట్రాలలో జరిగిన దాడులను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. దళితుల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత పై కేంద్రం భరోసా ఇవ్వాలని కోరారు. అణిచివేతకు గురైన దళితులకు అండగా ఉండడం కోసమే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారని, భారత ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో దళితుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు దళితుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం తరపున న్యాయస్థానానికి చెప్పాలని ప్రధాని మోదీని కోరారు. తమ హక్కులకు, చట్టాలకు భంగం కలుగుతందనే బాధలో దళితులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. దళితుల వెంట తాము ఉన్నామనే భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస కర్తవ్యమని చెప్పారు.