మూడు లేదా నాలుగు స్థానాల్లోకి ధోని..

SMTV Desk 2018-04-03 13:51:29  chennai super kings, ms dhoni, ipl-11, flemming csk coach

చెన్నై, ఏప్రిల్ 3 : రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) జట్టు టోర్నీ జట్టులలో బలమైన టీం. ధోని నేతృత్వం వహిస్తున్న ఈ జట్టు ట్రోఫీ నెగ్గాలని భావిస్తుంది. ముఖ్యంగా సారథి ధోనీ బ్యాట్స్‌మన్‌గా కీలకపాత్ర పోషిస్తాడని ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అంటున్నారు. అంతేకాదండోయ్‌ ధోనీ బ్యాటింగ్‌ స్థానంలో మార్పు కూడా ఉండొచ్చని, మూడు లేదా నాలుగు స్థానాల్లో వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆటగాళ్లు చెన్నై చేరుకుని శిక్షణ పొందుతున్నారు. తాజాగా ఆ జట్టు కోచ్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ.."ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ బ్యాట్స్‌మన్‌గా ముఖ్యపాత్ర పోషించనున్నాడు. ఇందుకోసం అతను చాలా కసరత్తులు చేస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో భారీ షాట్లు కొట్టేందుకే ప్రయత్నిస్తున్నాడు. కచ్చితంగా అతని బ్యాటింగ్‌ స్థానంలో మార్పులు ఉంటాయి. జట్టు అవసరాల పరంగా బ్యాటింగ్ కూర్పు ఉంటుంది. కేదార్‌ జాదవ్‌, అంబటి రాయుడు, జడేజా, బ్రావో, హర్భజన్, కర్ణ్‌ శర్మ తదితర ఆటగాళ్లతో మా జట్టు అన్ని విభాగాల్లో ఎంతో బలంగా ఉంది. ఇక కాంబినేషన్లపై దృష్టి పెట్టాలి" అని ఫ్లెమింగ్‌ వెల్లడించారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.