కాంగ్రెస్ మద్దతు ఇస్తే అవిశ్వాస తీర్మానం ; తంబిదురై

SMTV Desk 2018-04-02 10:48:50  aiadmk party, no cofidence motion, thambidurai, new delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 : పార్లమెంట్ లో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న నాటకీయ పరిణామాలకు ప్రధానకారణమైన అన్నాడీఎంకే పార్టీ అవిశ్వాస తీర్మానంపై ఒక కొత్త షరతు పెట్టింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మద్దతు ఇస్తే కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రేవేశపెడతామని మెలికపెట్టింది. ఈ విషయాన్ని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎం.తంబిదురై ఆదివారం చెన్నై విమానాశ్రయంలో తెలిపారు. "కావేరీ బోర్డు ఏర్పాటు చేయనందుకు మోదీ ప్రభుత్వంపై అన్నాడీఎంకే సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డీఎంకే నేత స్టాలిన్‌ అన్నారు. ఇందుకు మేం కూడా సిద్ధమే. అయితే ఇందుకు కాంగ్రెస్‌ మద్దతు కావాలి. అన్నాడీఎంకే తీర్మానానికి మద్దతిస్తున్నట్లుగా డీఎంకేకు మిత్రపక్షమైన ఆ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో ప్రకటన చేయించాలి. అయితే అది కేవలం కావేరీ నదిపైనే ఉండాలి. మరే సాధారణ అంశంపై చర్చ జరగకూడదు" అని షరతు విధించారు. అయితే కర్ణాటకలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహంలో ఇది భాగమని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల్లో కావేరీ వ్యవహారం చాలా సున్నితమైన అంశం.