నిరసనలో ఘర్షణ:16 మంది మృతి

SMTV Desk 2018-03-31 12:23:06  Israel palastina, Gaza, America

గాజా, మార్చి 31: ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దులో పాలస్తీనియన్లు చేపట్టిన నిరసనలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పాలస్తీనియన్లు- ఇజ్రాయెల్‌ దళాల మధ్య చెలరేగిన గొడవల్లో 16 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 11 వందల మంది గాయాలపాలయ్యారు. శరణార్థులు తిరిగి ఇజ్రాయెల్‌కు వచ్చే అంశంపై ఆరు వారాల పాటు ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దులో నిరసన చేపట్టాలని పాలస్తీనియన్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నుంచి ప్రారంభమైన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఇజ్రాయెల్‌ నుంచి జెరూసలేంకు అమెరికా ఎంబసీని మార్చనున్నట్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్ ఫొటోలను నిరసనకారులు తగులబెట్టారు. దీంతో 30 వేల మందిపై ఇజ్రాయెల్‌ సైన్యం డ్రోన్లను ఉపయోగించి ఏడుపు వాయువును ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ సరిహద్దులోని ఫెన్సింగ్‌కు హాని కలిగించడం వల్లే ఆందోళనకారులపై కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.