దేశంలో నేటి నుంచే జీఎస్టీ ప్రారంభం

SMTV Desk 2017-07-01 12:14:08  gst , Parliament Central Hall,President Pranab Mukherjee, Vice President Hamid Ansari, Lok Sabha Speaker Sumitra Mahajan, Prime Minister Narendra Modi and former prime minister HD Deve Gowda,

న్యూఢిల్లీ, జూలై 01 : నేటి నుంచే జీఎస్టీ ప్రారంభమైంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రతిష్ఠాత్మక వస్తు-సేవల అమలుకు శుక్రవారం అర్ధరాత్రి జైగంట మోగింది. ఒకే దేశం-ఒకే పన్ను విధానం అధికారికంగా అమల్లోకి వచ్చింది. అనుమానాలు, అపోహలను పటాపంచలు చేస్తూ, ఎన్నో ఏళ్లుగా అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఆర్థిక నిపుణుల మధ్య తర్జనభర్జనలకు, చర్చోపచర్చలకు తావిచ్చిన నూతన, పరోక్ష పన్ను విధానం ఎట్టకేలకు పట్టాలేక్కింది. జీఎస్టీని ప్రధాని గూడ్స్ సింపుల్ ట్యాక్స్ గా అభివర్ణించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడతో పాటు రాజకీయ నాయకులు, పలువురు పారిశ్రామికవేత్తలు తదితరులు హాజరయ్యారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, నరేంద్రమోదీలు ఢంకా మోగించి కొత్త వ్యవస్థకు సాదరంగా ద్వారాలు తెరిచారు. దేశ మార్కెట్టును ఏకీకృతం చేసేలా ఒకే పన్ను శాతం రావడం వల్ల వస్తువులు ఎక్కడైనా ఒకే ధరకు లభించడమే కాకుండా వ్యాపారులకు ఇక వేధింపులు ఉండబోవని ప్రధానమంత్రి మోదీ అభయమిచ్చారు. జీఎస్టీ అనేది భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో అతిపెద్ద సంస్కరణ అని రాష్ట్రపతి తెలిపారు. జీఎస్టీ ప్రారంభ వేడుకలో వారిద్దరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రసంగించారు. కీలక ఘట్టం సాకారం కావడం వెనక సాగిన ఏళ్లనాటి కృషిని వారు గుర్తు చేసుకుని పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. జీఎస్టీని ప్రధాని ఆవిష్కరించి అధికారికంగా ప్రారంభించారు.