24 గంటల్లో 6 ఎన్‌కౌంటర్లు..

SMTV Desk 2018-03-25 17:59:20  Police encounters, Uttar Pradesh, Yogi Adithya Nath, criminals

లఖ్‌నవూ, మార్చి 25: ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం 24 గంటల వ్యవధిలో ఆరు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మృతి చెందగా.. ఒక పోలీస్‌ అధికారి ప్రాణాలు కోల్పోయారు. పలు క్రిమినల్‌ కేసులో ఉన్న ఐదుగురికి బుల్లెట్‌ గాయాలయ్యాయి.నోయిడా, దిల్లీలోని పలు హత్య కేసుల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న శరవన్‌ చౌదరి ఈ ఎన్‌కౌంటర్లో మృతి చెందాడు. అతడిపై రూ.50వేల రివార్డు ఉంది. అతడి దగ్గర నుంచి ఏకే-47రైఫిల్‌, ఓ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘నేరస్థులు నగరంలోకి వచ్చినట్లు సమాచారం వచ్చింది. వాళ్లని పట్టుకోవడానికి వెళ్లడంతో మమ్మల్ని చూసి ఏకే-47తో కాల్పులు జరిపారు’ అని నోయిడాకి చెందిన సీనియర్‌ పోలీస్‌ అధికారి అజయ్‌ పాల్‌శర్మ తెలిపారు. దాద్రిలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో జింతేదర్‌ అనే నేరస్థుడు హతమయ్యాడు. షహరాన్‌పూర్‌లో అషన్‌ అనే వ్యక్తి పోలీసుల జరిపిన కాల్పుల్లో బుల్లెట్‌ గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక నవాబ్‌ ప్రాంతంలో ద్విచక్రవాహనంపై కొందరు దొంగతనం చేసి పారిపోతుండగా వెంబడించిన పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్‌ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఘజియాబాద్‌లో ఒకరు, ముజఫర్‌నగర్‌లో ఇద్దరిపైనా పోలీసులు కాల్పులు జరిపారు. తూటాల గాయాలు అయిన వారిని ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించారు. .