ఆ మ్యాచ్ గుర్తొస్తే బాధగా ఉంది : సౌమ్య సర్కార్‌

SMTV Desk 2018-03-23 13:33:31  soumya sarkar, india vs bangladesh, nidahas trophy, bangladesh

ఢాకా, మార్చి 23 : శ్రీలంక వేదికగా శ్రీలంక- భారత్- బంగ్లాదేశ్- ల మధ్య జరిగిన నిదహాస్‌ ట్రోఫీను టీమిండియా జట్టు కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆదివారం ఉత్కంఠభరింతగా ఈ మ్యాచ్ లో ఫైనల్లో భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రపంచ కప్ ఫైనల్ ను తలపించింది. లక్ష్య ఛేదనలో భాగంగా టీమిండియా చివరి ఓవర్ ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాల్సిన తరుణంలో దినేష్ కార్తీక్ సిక్స్ కొట్టి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ అపజయం నుండి బంగ్లా జట్టు ఇంకా బయటకు రాలేకపోతుంది. దాదాపు గెలుపు ఖాయమైన ఈ మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లు ఓటమిని మర్చిపోలేకపోతున్నారు. కాగా ఇదే విషయంపై చివరి ఓవర్‌ వేసిన సౌమ్య సర్కార్‌ స్పందించాడు. మ్యాచ్‌ ఓటమికి తాను కూడా కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. "టీమిండియాతో మ్యాచ్‌ ఓటమి మరచిపోలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ మ్యాచ్‌ గుర్తొస్తే బాధగా ఉంది. ఆఖరి ఓవర్‌లో భారత్‌ గెలుపుకు అవసరమైన 12 పరుగుల్ని ఇవ్వడం నా కెరీర్‌లో చేదు జ్ఞాపకం. ముఖ్యంగా చివరి బంతికి సిక్సర్‌ ఇచ్చి మా పరాజయంలో భాగమయ్యా. ఆ రోజు నేను బాగా బౌలింగ్‌ చేసి ఉంటే 16 కోట్ల మంది పెదవులపై చిరునవ్వును చూసేవాళ్లం" అని సౌమ్య వ్యాఖ్యానించాడు.