మా నుండి పొరపాటు జరిగింది : జుకర్‌బర్గ్‌

SMTV Desk 2018-03-22 12:22:24  Face book, Mark Zuckerberg, Face Book Account Profile Details liked.

వాషింగ్టన్, మార్చి 22 : కోట్లాదిమంది ఫేస్‌బుక్‌ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమైందని ఫేస్‌బుక్‌ వెబ్‌సైట్‌ పై వస్తున్న ఆరోపణలకు ఆ సంస్థ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన మౌనాన్ని వీడారు. ఒక ఫేస్‌బుక్‌ పోస్ట్ ద్వారా ఆయన స్పందిస్తూ.. యూజర్ల సమాచారాన్ని రహస్యంగా ఉంచడంలో కంపెనీ నుంచి పొరపాటు జరిగిందని ఆయన అంగీకరించారు. తమ పొరపాటును సరిదిద్దుకుంటున్నామని.. భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఖాతాదారుల సమాచారం భద్రపరచడం మా బాధ్యత అన్న జుకర్ బర్గ్.. అలా చేయకపోతే తమకు సేవలందించే అర్హత లేదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావిత౦ చేసే లక్ష్యంతో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ ఓ క్విజ్ యాప్ ను అడ్డం పెట్టుకొని దాదాపు ఐదుకోట్ల మంది వ్యక్తిగత వివరాలను తస్కరించిన తీరును ఆయన వివరించారు. అలాంటి యాప్ ద్వారా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కాకుండా గత కొన్నేళ్లలో అనేక చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. ఆ దిశలో ఇంకా ఎంతో చేయాల్సింది ఉందని అన్నారు. పేరు, ప్రొఫైల్ ఫోటో, ఇ-మెయిల్, చిరునామా మినహా ఇతర వివరాలేవీ యాప్ లు పొందకుండా నిబంధనలను కఠినం చేస్తామని మార్క్ స్పష్టికరించారు.