ఏసీ బస్సుల ధరలో స్వల్ప మార్పులు

SMTV Desk 2017-06-29 17:43:45  GST, AC bus charges, Red Bus, Abhi bus, Travel Agencies

న్యూఢిల్లీ, జూన్ 29 : మరో రెండు రోజుల్లో జీఎస్టీ అమలవుతున్న సందర్భంగా ఏసీ బస్సు చార్జీలు స్వల్పంగా తగ్గనున్నాయి. టికెట్ ధరలో ఏ మార్పు ఉండకపోయినప్పటికీ వాటిపై చెల్లించే సేవాపన్ను రేటు 6 శాతం నుంచి జీఎస్టీ 5 శాతానికి తగ్గడం వల్ల పన్ను రూపంలో ఒక్క శాతం లాభాన్ని ప్రయాణికులకు వర్తింపజేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు బస్సులో ప్రయాణించడానికి టికెట్లు కొనుగోలు చేయడానికై ఆన్ లైన్ కేంద్రాలను సంప్రదిస్తున్నారు.ఇప్పటికి ట్రావెల్స్ కార్యాలయాలు, బస్టాండ్ లలో వాటి కోసం ప్రత్యేక కౌంటర్లు ఉండగా, చాలామంది కొద్ది సేపట్లో బయలుదేరతామనుకునే సందర్భంలోనే అక్కడకు వెళ్లి టికెట్లు తీసుకుంటున్నారు. ముందుగానే సిద్దం చేసుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్ళే వారు ఆన్ లైన్ లో ఆఫర్లు చూసుకుంటూ టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. వివిధ ట్రావెల్ సంస్థలు తమ సొంత పోర్టల్లను నిర్వహిస్తున్నాయి. ఇవి కాకుండా అన్ని సంస్థల టికెట్లను ఒకే చోట విక్రయించే అభిబస్, రెడ్ బస్ వంటి వాటికి కూడా జూలై 1 నుంచి సేవాపన్ను స్థానంలో జీఎస్టీ అమలు అవుతుంది. ఆన్ లైన్ లో బస్ టిక్కెట్ కొనే సమయంలో ఏదైనా రాయితీ ఇచ్చినా, 6 శాతం వరకు సేవాపన్నును మాత్రం ఈ సంస్థలన్నీ ప్రయాణికులకే విధిస్తున్నాయి. ఏసీ బస్, క్యాబ్ ల వంటి రవాణా సంస్థలకు సేవాపన్ను రేటులో 60 శాతాన్ని మినహాయిస్తూ పన్ను శాఖ ఏప్రిల్ 1 న ఉత్తర్వులు జారీ చేసింది. సేవాపన్ను రేటులో 40 శాతాన్నే ఈ సంస్థల వద్ద వసూలు చేస్తున్నందున ఇతర రంగాలకు 15 శాతం పన్ను విధిస్తే రవాణారంగంలో మాత్రం కేవలం 6 శాతంగానే ఉంది. ఆర్టీసీ అయినా, ప్రైవేటు ట్రావెల్స్‌ అయినా ఇది ఒకేరకంగా ఉంటోంది. ఇదికూడా ఎయిర్‌ కండీషన్డ్‌ (ఏసీ) బస్సుల టికెట్లపై మాత్రమే ఇది వసూలవుతోంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఇది 5 శాతమే కానుంది. దీని ప్రకారంగా గమనిస్తే 1 శాతం భారం తగ్గనుంది. ఉదాహరణకు హైదరాబాద్, తిరుపతి ఏసీ బస్ టికెట్ ధర రూ. 600 లుగా ఉంటే , చెల్లింపులకు వచ్చే సరికి 6 శాతం సేవాపన్ను రూ. కలిపి రూ. 36 కలిపి 636 రూపాయలుగా వసూలు చేస్తున్నారు. అలా కాకుండా నూతన విధానంలో 5 శాతం పన్ను కింద రూ. 30 కలిపి 630 రూపాయలు మాత్రమే అవుతుంది. ఏసీయేతర బస్సుల టికెట్లపై ప్రస్తుతం సేవారుసుం వసూలు చేయడం లేదు. జీఎస్టీ లోను వీటి గురించి ప్రస్తావించలేదు. పోర్టళ్ల నిర్వాహకులకు ఆర్టీసీ, ట్రావెల్స్‌ సంస్థలు, టికెట్‌ ధరపై కమీషన్‌ కింద 10 శాతాన్ని చెల్లిస్తున్నాయి. ఈ కమీషన్‌పై ప్రభుత్వానికి 15 శాతం సేవాపన్నును పోర్టల్ యజమానులు చెల్లిస్తున్నారు. ఇకపై ఇది 18 శాతం కానుంది. అంటే 3 శాతం అధికమవుతుంది. ఈ భారాన్ని తాము వహించలేమని, పోర్టల్‌ సంస్థలే చూసుకోవాలని ట్రావెల్స్‌ యజమానులు స్పష్టం చేస్తున్నారని సమాచారం. టికెట్‌ ఛార్జీ నిర్ణయాన్ని ఆర్టీసీ లేదా ట్రావెల్స్‌ ఆపరేటర్లే నిర్వహిస్తారు కనుక, సేవాపన్ను రూపేణ ఆన్‌లైన్‌ పోర్టలలకు పడుతున్న 3 శాతం భారాన్ని ప్రయాణికులకు బదలాయించే అవకాశం తక్కువేనని అభిబస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుధాకరరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆఫ్‌ సీజన్‌ కావడంతో గిరాకీ కూడా బాగా తక్కువగా ఉందని, ఈ ప్రభావం ఏసీ బస్సులపై మరింత ఎక్కువని పోర్టల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.