పది ప్రశ్నాపత్రం లీక్ కాలేదు..

SMTV Desk 2018-03-20 11:00:53  Telangana,ssc examination, question paper, english-1, leakage

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణలో పదో తరగతి ఇంగ్లీషు పేపర్ -1 ప్రశ్నాపత్రం ఎక్కడా లీక్ కాలేదని పాఠశాల విద్య సంచాలకుడు జి కిషన్ సోమవారం రాత్రి పేర్కొన్నారు. కొంత మంది విద్యార్థులు, ఇన్విజిలేటర్లు మాల్ ప్రాక్టీసుకు ప్రయత్నించారని, అంతే తప్ప పేపర్ లీక్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం నాడు యథాతథంగా ఇంగ్లీషు పేపర్-2 జరుగుతుందని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇంగ్లీషు ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టినా అదంతా అసత్య ప్రచారమని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌లో పేపర్‌లీక్ అయినట్టు భావిస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ స్పష్టం చేసినా, అలాంటిదేమీ లేదని కమిషనర్ పేర్కొన్నారు. ఇదే ఘటనపై ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం తాడిహత్నూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లీషు ప్రశ్నాపత్రం ఫోటో కాపీని తీయడంలో ఒక ఇన్విజిలేటర్ ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం అధికారులు గుర్తించారని కమిషనర్ పేర్కొన్నారు. దీంతో చీఫ్ సూపరింటెండెంట్ భరత్ చౌహాన్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ జగన్మోహన్, కస్టోడియన్ నాగోరావు, ఇన్విజిలేటర్ కృష్ణవేణిలను సస్పెండ్ చేశామని అన్నారు.