రైల్వే శాఖ వారికి రూ. 950 చెక్కు పంపించిన ప్రయాణికుడు

SMTV Desk 2017-06-28 16:30:41  IRCTC, Railway Department, discount in trains, chek

న్యూఢిల్లీ, జూన్ 28 : సాధారణంగా రైళ్ళలో ప్రయాణించే సమయంలో టికెట్లను ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటాం. ఆ సమయంలో మనం ప్రయాణించే వివరాలను నమోదు చేసిన తర్వాత టికెట్ తీసుకుని రైల్వే స్టేషన్ కు బయలుదేరి, మన సీటు ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్లి కూర్చుంటాం. అంతేకాని టికెట్ పై ఏ అంశాలు ఉన్నాయో అసలు గమనించం. ఒక ప్రయాణికుడు మాత్రం దానికి భిన్నంగా టికెట్ లో ముద్రితమైన సమాచారాన్ని గ్రహించి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) కు 950 రూపాయల చెక్కు పంపించాడట. వివరాల్లోకి వెళ్తే రైలులో ప్రయాణించే ప్రతి వ్యక్తిపై 43 శాతాన్ని రాయితీ రూపంలో రైల్వే శాఖ భరిస్తున్నందున ప్రతి సంవత్సరం ఆ శాఖకు 30,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి ఈ సమాచారాన్ని టికెట్ పై ముద్రించారు. ఈ విషయాన్ని చదివిన ఒక ప్రయాణికుడు తనకు రాయితీ అవసరం లేదని, ప్రభుత్వం ఆయన టికెట్ ధరపై భరించిన 43 శాతానికి గాను రూ. 950 ల చెక్కును ఢిల్లీలోని ఐఆర్సీటీసీ కార్యాలయానికి పంపించాడు. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం ఇలాంటి చెక్కులు స్వీకరించడానికి అనుమతి లేకపోవడంతో దానిని తిరిగి ప్రయాణికుడికే పంపుతామని ఆ శాఖ సీనియర్ అధికారి ప్రకటించారు.