సివిల్స్ మూడవ టాపర్ కు కోర్టు నోటీసులు

SMTV Desk 2017-06-28 15:01:05  civils 2017 toppers, Andhra Pradesh, Justice Ramesh Raganathan, Justice Rajini,

హైదరాబాద్‌, జూన్ 28: ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాలలో కే.ఆర్ నందిని, అన్మోల్ షేర్ సింగ్ బేడి, గోపాల కృష్ణ రోణంకి తొలి మూడు స్థానాలను సంపాదించుకున్న విషయం తెలిసిందే. తెలుగు తేజం రోణంకి గోపాల కృష్ణ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి చెందినవాడు. ఉపాధ్యాయ వృత్తి లో కొనసాగుతూనే సివిల్స్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యాడు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో తప్పుడు అంగవైకల్య ధృవీకరణ పత్రం సమర్పించడం ద్వారా జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించారన్న ఆరోపణలకు మురళీకృష్ణ అనే న్యాయవాది ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సంబంధించి రోణంకి గోపాలకృష్ణకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. దీనికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, జస్టిస్‌ టి.రజనిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ వాదిస్తూ గోపాలకృష్ణ ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థి అయినప్పటికీ 45 శాతం అంగవైకల్యం ఉన్నట్లుగా ధృవీకరణ ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రిలిమినరీ పరీక్షలో అంగవైకల్యం కోటా కింద 75.34 శాతం కటాఫ్‌ మార్కులుగా ఉంటే, ఓబీసీ కేటగిరీకి కటాఫ్‌ మార్కులు 110.66 అని వివరించారు. గోపాలకృష్ణకు ప్రిలిమినరీలో 91.34 మార్కులు వచ్చాయన్నారు. సాధారణ అభ్యర్థులకు మెయిన్స్‌లో మూడు గంటల సమయమిస్తే, అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు మరో గంట అదనంగా సమయమిస్తారని పిటిషనర్ చెప్పారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం గోపాలకృష్ణకు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, యూపీఎస్సీకి నోటీసులిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణను నాలుగు వారాల తరవాత కొనసాగిస్తామని తెలిపినట్లు సమాచారం.