నారాయణ రెడ్డి హత్యకేసులో పురోగతి

SMTV Desk 2017-05-29 11:41:49  karnool,narayanreddy murder, faction murder,brutal murder

కర్నూల్, మే 28 : ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఫ్యాక్షన్ హత్యకాండ కేసులో పురోగతి చోటు చేసుకుంది. గత నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు చెరుకులపాడు నారాయణ రెడ్డి, అతని అనుచరుడు సాంబశివుడు హత్యకేసులో 12 మంది నిందితులను పోలిసులు అరెస్ట్ చేశారు. బోయ, కురుమ కుటుంబాల మధ్య సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తున్న వైరమే హత్యలకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకాండకు ఉపయోగించిన ట్రాక్టర్లు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం జిల్లా కేంద్రమైన కర్నూల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలిసులు తెలిపారు. కర్నూల్ రెంజ్ డిఐజి రమణకుమార్, ఎస్ పి రవికృష్ణ, ఐఓ బాబాఫకృద్ధిన్ లు మీడియా సమావేశంలో పాల్గోన్నారు. ఇటీవల కాలంలో నారాయణరెడ్డి వర్గీయులు వేర్వేరు ఘటనల్లో భీసన్నగారి రామాంజనేయులు, కోతుల రామానాయుడుని చంపుతామని బెదరించడంతో హత్యకు పథకం ప్రారంభం అయిందని చెప్పారు. వారు చంపుతారని తీవ్ర మనోవేదనకు గురైన వారు కుటుంబ సభ్యులంతా ఏకమై హత్యకు పథకం రచించారని వివరించారు. ఈనెల 21న జరిగే పెళ్ళికి చెరుకుల పాడు నారాయణ రెడ్డి హాజరవుతారని సమాచారం అందుకొని తమ పథకాన్ని అమలు చేసారని వెల్లడించారు. అయితే హత్యకేసులో పాల్గొన్న నిందితుడు తమ కుటుంబ సభ్యులకు చేసిన ఫోన్ ద్వారా, నిందితులను చాకచక్యంగా ఆరెస్ట్ చేయగలిగామని పోలీసులు వెల్లడించారు.