మహిళలకు అండగా "వీ-హబ్"..

SMTV Desk 2018-03-09 14:59:33  hyderabad, vhub, started, i.t. minister, ktr

హైదరాబాద్, మార్చి 9: ఆవిష్కరణల రంగంలో మహిళలు ముందడుగు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న “వీ-హబ్” తొలిమెట్టు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. మహిళా సాధికారతకు కట్టుబడి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వమే ముందుకు వచ్చి వీ-హబ్ పేరుతో పరిశోధనలకు ఊతం ఇస్తు౦దని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో వీ-హబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మానవ పరిణామ క్రమంలో మహిళల్లో సృజనాత్మక శక్తి ఉన్నప్పటికీ వారికి ప్రోత్సాహం దక్కకపోవడం వల్ల వారి ప్రతిభ వెలుగులోకి రాలేదు. ఇటీవలి కాలంలో కూడా అండదండలు లేకపోవడం వల్ల పలువురు ముందుకు రాలేకపోయారు. అందుకే మహిళలకు అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకొంది. విజేతల్లో ఎక్కువశాతం ఎవరి ప్రోత్సాహం లేకుండానే ఎంతో శ్రమకోర్చి తమ సత్తాను చాటుకున్నవారే. అయితే అలాంటి వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆవిష్కరణల కేంద్రం వీ-హబ్ ప్రారంభించామని వెల్లడించారు.