మోదీపై సోనియా తీవ్ర విమర్శలు..

SMTV Desk 2018-03-09 14:25:34  delhi, sonia, comment, bjp, government

న్యూఢిల్లీ, మార్చి 9 : ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ 2018లో పాల్గొన్న కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ హయాంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, తమ నోరు నొక్కేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం దేశం తిరోగమన పథంలో ఉందని పేర్కొన్నారు. భాజపా హయాంలో అసహనం పెరిగిపోయిందన్నారు. భయం, బెదిరింపులు, మత ఘర్షణలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. ఇక పార్లమెంటు మూసేస్తే.. మేమంతా ఇంటికి వెళ్లిపోతాం అని అన్నారు. వాజ్‌పేయి హయాంలో మాదిరిగా పార్లమెంటు కార్యకలాపాలు గౌరవప్రదంగా ఉండట్లేదన్నారు. ‘భాజపా హయాంలో ఆర్థికాభివృద్ధి గణనీయంగా ఉందని చెబుతున్నారు. 2014 మే 26కు ముందు భారత్‌ ఏమైనా అగాథంలో కూరుకుపోయి ఉందా? ఈ నాలుగేళ్లలోనే భారత్‌ అభివృద్ధి, గొప్పదనం సాధించిందా? ఇలా చెప్పుకోవడం భారత ప్రజల మేధస్సుకు అవమానం కాదా?’ అని సోనియా ప్రశ్నించారు. మన న్యాయవ్యవస్థ ప్రస్తుతం సంక్షోభంలో ఉందన్నారు. తమపై చేస్తున్న అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువ చేసి చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను, చర్చలను అంగీకరించాలని, ఏకపాత్రాభినయాన్ని కాదని సోనియా వ్యాఖ్యానించారు.