ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదు : పవన్

SMTV Desk 2018-03-04 12:06:34  janasena party, pawan kalyan, special status.

హైదరాబాద్, మార్చి 4 : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదని జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విభజన హామీలకు సంబంధించి 11 అంశాల అమలుపై సుదీర్ఘంగా చర్చించి నివేదిక రూపొందించారు. కేంద్ర౦పై అవిశ్వాస తీర్మానం ఈ నెల 5 వ తేదీన నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందని, 21 వ తేదీన నిర్వహిస్తే ప్రయోజనమేమి ఉండదని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహార౦లో వైకాపా తీరు కాస్త అనుమానాస్పదంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాకు కాలం చెల్లిందని కేంద్రం చెపుతోంది కానీ ఇప్పటికీ 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కలిగి ఉన్నాయి. ప్రత్యేకహోదాకు ఏదీ సరిపోదని.. రాష్ట్రానికి వందశాతం న్యాయం హోదా ద్వారానే సాధ్యమవుతుందన్నారు. "ఏపీలో అనుకూలత లేదని కేంద్రం అంటోంది. అంతా అనుకూలంగా ఉంటుందనే రాష్ట్రాన్ని విభజించారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి ప్రత్యేక హోదా, మరోసారి ప్యాకేజ్ అంటూ ఏవేవో ప్రకటనలు చేస్తున్నారు. ఆ పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం తన భుజాలమీద వేసుకుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అసంపూర్తిగా మిగిలిపోతే నింద రాష్ట్రప్రభుత్వంపైనే పడుతుంది. ఇంతా అన్యాయం జరుగుతున్న కేంద్రాన్ని అడగడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. చేయని తప్పుకు ప్రజలు నష్టపోతున్నారు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.