భారత్ సొంత శక్తితో సత్తా చాటుతుంది - మోదీ

SMTV Desk 2017-06-26 15:58:40  India, America , Verjeeniya, Washington, Surgical Attacks,Narendra Modi,Pakistan

వాషింగ్టన్, జూన్ 26 : భారత్ తన స్వీయ రక్షణకు ఎలాంటి భంగం వాటిల్లకుండా నిరంతరం చర్యలు తీసుకునేందుకు ఎట్టి పరిస్థితిలో వెనుకడుగు వేసే ప్రయత్నాలు చేయదని, దానికి సర్జికల్ దాడులే నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వర్జీనియాలోని ఇరు దేశాల విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ వేదికగా ఆయన మాట్లాడుతూ భారత్ భద్రత కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పని లేదని, సొంత శక్తిని ఉపయోగించి సత్తా చాటే సామర్ధ్యం కల్గి ఉందని అమెరికాలో ఉండే భారతీయులను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది నెలల క్రితం భారత్ లో జరిగిన పాక్ ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు ఎంతో క్రియాశీలక పాత్ర వహించిన భారత సైన్యాన్ని ప్రశంసించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన సర్జికల్ దాడుల గురించి ప్రస్తావిస్తూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా ప్రపంచదేశాలకు సందేశం ఇవ్వడమే కాకుండా తమ సార్వబౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని మోదీ పేర్కొన్నారు. 20 సంవత్సరాల క్రితం భారత్ ఉగ్రవాదం గురించి చెప్పిన సమయంలో కొన్ని దేశాలు అది చట్టం, శాంతి భద్రతల సమస్యగా భావించి, దాని తీవ్రతను గమనించని పక్షంలో ప్రస్తుతం ఉగ్రవాదం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో వారికి తీవ్రవాదులే చూపిస్తున్నారని తెలిపారు. భారత పౌరులను కాపాడుకునే దిశగా ఎంతటి చర్యలను తీసుకోవడానికైనా సిద్దమని, అవి అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటాయని ప్రపంచ దేశాలతో మంచి సఖ్యతను పెంచుకోవడమే తమ లక్ష్యమని మోదీ తెలిపారు. ఆయన మాట్లాడిన తీరును గమనిస్తే సరిహద్దుల విషయంలో ఎల్లప్పుడూ కయ్యానికి దిగే పాకిస్తాన్ ,ఆ దేశానికి మద్దతు ఇచ్చే చైనాపై పరోక్ష విమర్శలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారని సమాచారం.