బోండా ఉమ వైఖరిపై మండిపడిన ప్రతిపక్షాలు

SMTV Desk 2017-06-25 20:01:56  AP Brahman Welfare Corporation, TDP MLA Bonda Uma, Congreess Senior Candidate Malladi Vishnu, YSRCP MLA Kona Raghupathi

గుంటూరు, జూన్ 25 : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బోండా ఉమ చేసిన వ్యాఖ్యలకు బ్రాహ్మణులు తగిన బుద్ధి చెబుతారని బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. గుంటూరులో ఆదివారం జరిగిన బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ, ఐవైఆర్ పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. తెదేపా నేతలు తమ స్థాయిని అనుసరించి మాట్లాడాలని హెచ్చరించారు. డిసెంబర్ లో లక్షలాది మంది బ్రాహ్మణులతో సభను నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు మాట్లాడుతూ బొండా ఉమ ఒక రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాలలో ఏపీ మంత్రి నారా లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రస్తుతం ఐవైఆర్ పై పోస్టులు పెట్టిన వారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదో ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని విష్ణు డిమాండ్ చేశారు.