నల్లా కనెక్షన్ కు సరికొత్త యాప్..!

SMTV Desk 2018-02-26 12:22:56  water connection, specila app, water resources revenue director vijay kumar reddy.

హైదరాబాద్, ఫిబ్రవరి 26 : మాకు నల్లా కనెక్షన్లు కావాలంటూ ఇక నుండి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో నుండే దరఖాస్తు చేసుకొని నల్లా కనెక్షన్ పొందే వీలును అధికారులు కల్పించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్ విధానంతో పాటు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా స్మార్ట్ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ను తెరిచి అందులో కొత్త నల్లాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువపత్రాలను ఫొటో తీసి వాటిని యాప్ ద్వారా దరఖాస్తులో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. అలా అప్‌లోడ్ చేసిన పత్రాలను ఒక సెట్‌ను సమీపంలోని జలమండలి కార్యాలయంలో అందిస్తే సరి. అంతేకాదు ఇచ్చిన గడువులోగా కనెక్షన్ ఇవ్వకపోతే యాప్ ద్వారానే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చెయ్యవచ్చు. కనెక్షన్ చార్జీలను సైతం ఆన్‌లైన్ లో చెల్లించే వీలుంది. త్వరలోనే ఈ యాప్‌ను పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జలమండలి రెవెన్యూ డైరెక్టర్ విజయ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.