గోల్కొండలో మొదలైన తొలి బోనం

SMTV Desk 2017-06-25 16:31:07  today golkonda , First boon, telangana, amma sreejagadambika temple, ministers, indrakaranreddy, thalasani srinivasyadav

హైదరాబాద్, జూన్ 25 : తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే బోనాల జాతర నేడే జరగనుంది. ఆషాఢ మాసంలో ఊరూరా అంగరంగ వైభవంగా జరుపుకొనే ఈ సంబురాలు ఆదివారం హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీజగదాంబిక (ఎల్లమ్మ) ఆలయంలో తొలిబోనంతో మొదలుకానుంది ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్.. అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. ఆదివారం ఉదయం గోల్కొండ కోటకు సమీపంలోని లంగర్‌హౌజ్ చౌరస్తా వద్ద నుంచి తొట్టెల ఊరేగింపుతో ఉత్సవ ఘట్టం ప్రారంభమవుతుంది. ఊరేగింపు మధ్యాహ్నం రెండు గంటలకు కోటలోని బడా బజార్‌లో ఉన్న ఆలయ పూజారి ఇంటికి చేరుకొని, పూజారి ఇంట్లో ఉన్న ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కంకణధారణ తర్వాత కోటలోకి ప్రవేశించే ఊరేగింపుతో సాయంత్రం ఆరు గంటలకు ఆలయానికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. గోల్కొండ బోనాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే భక్తులకోసం బస్సు సౌకర్యం కల్పిస్తూ భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గోల్కొండ బోనాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జానపద వైభవాన్ని,చాటే కళా ప్రదర్శనలుంటాయని అధికారులు తెలిపారు. వీటితో పాటు అనంతరం పోతరాజుల వీరంగాలతో అమ్మ వారి ఊరేగింపు జోరుగా కొనసాగుతుంది.