అక్రమ వసూళ్ళకు తెగబడిన రవాణా శాఖాధికారిణి పై సస్పెన్షన్ వేటు

SMTV Desk 2017-05-29 11:32:35  swathigoud,vehical inspector,hyderabad,madapur

హైదరాబాద్, మే 27 : కిరాయి మనుషులతో అక్రమ వసూళ్ళకు తెగబడుతున్న రవాణాశాఖాధికారిణి పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం సంబంధిత శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. గత శనివారం రాత్రి సాగర్ రింగ్ రోడ్ సమీపంలో సాయిరాం కాంటా వద్ద తిరుమలగిరి ప్రాంతీయ రవాణాశాఖకు చెందిన ఏఎంవిఐ స్వాతిగౌడ్ అటుగా వెళ్తున్న లారీని నిలిపి తనిఖీ చేసి, ఓవర్ లోడ్ అంటు డ్రైవర్ కు జరిమానా విధించారు. ఆ మేరకు జరిమానా చెల్లించేందుకు లారీ ఓనర్ శ్రీకాంత్ రెడ్డి అక్కడకు చేరుకోవడం, అదే క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం జరిగింది. ఆగ్రహించిన ఏఎంవిఐ స్వాతిగౌడ్ ప్రైవేటు వ్యక్తులను పిలిపించడంతో వారు అక్కడకు చేరుకొని శ్రీకాంత్ రెడ్డి పై దాడికి పూనుకున్నారు. అయితే ఈ విషయమై స్వాతిగౌడ్, శ్రీకాంత్ రెడ్డిలు ఇరువులు పరస్పరం పోలిసులకు పిర్యాదు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన సిసి కెమేరా పుటేజిని సేకరించిన శ్రీకాంత్ రెడ్డి సదరు సీడిలను పోలిసులు, ఆర్టీఏ ఉన్నతాధికారులకు అందించారు. ఆ విషయమై విచారణ నిర్వహించిన రవాణా శాఖ ఉన్నతాధికారులు స్వాతిగౌడ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరిధి కాని ప్రాంతంలోకి వెళ్ళి కిరాయి మనుషులతో వసూళ్ళకు తెగబడినట్లుగా విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.