తెలంగాణ సీఎం కు శస్త్రచికిత్స

SMTV Desk 2017-06-25 12:10:12  Telangana CM KCR Eye Operation, Tuglak Road,Central Labour Minister, Dr. Sachdev

హైదరాబాద్, జూన్ 25 : తెలంగాణ ముఖ్యమంత్రి (సీఎం) కె.చంద్రశేఖర్ రావుకి సోమవారం రోజున కంటికి శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. దీనిలో భాగంగా గత మూడు రోజుల నుంచి ఢిల్లీలో ఆయన అధికార నివాసం అయిన 23, తుగ్లక్ రోడ్డుకు వైద్యులు వచ్చి కంటిలో చుక్కల మందు వేశారని మీడియా వర్గాలు తెలిపారు. అంతకు ముందు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు కేసిఆర్ కు కుడి కంటిపై పొర ఏర్పడడంతో కాస్త చూపు మందగించింది. మందులు ఇస్తే తగ్గిపోతుందని వైద్యులు భావించారు. ప్రస్తుతం నేత్ర పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్రచికిత్స చేయడం తప్పనిసరని సీఎంకు సూచించగా ఆయన అంగీకరించారు. కేసిఆర్ గతంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో డా. సచ్ దేవ్ అనే వైద్యుడు ఆయనకు వైద్యం చేశారని, ఇప్పుడు కూడా ఆయనే శస్త్రచికిత్స నిర్వహిస్తారని సమాచారం. శస్త్రచికిత్స జరగనున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సీఎం ఢిల్లీ లోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు.ఆ రోజు అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే జీఎస్టీ వేడుకలలో పాల్గొంటారని ఆ తర్వాత హైదరాబాద్ పయనమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.