ఐచ్చికాలను కొనసాగించండి- హైకోర్టు న్యాయమూర్తి

SMTV Desk 2017-06-24 19:34:25  State Bank Of India Merger, Andhra Pradesh High Court , Justice

హైదరాబాద్, జూన్ 24 : గత కొద్ది నెలల క్రితం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్‌బీఐ) యొక్క 5 అనుబంధ బ్యాంకుల విలీనం తెలిసిందే. అందులో భాగంగా ఆ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ఐచ్చికాలను స్వీకరించడానికి ఉమ్మడి హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 13 వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం జూన్ 15 వరకు ఉద్యోగులు ఎంపిక చేసుకున్న ఐచ్చికాలను కొనసాగించకూడదని పేర్కొన్న ధర్మాసనం శుక్రవారం రోజున వాటిని నిలిపివేసినట్లు జస్టిస్ ఎం. రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకున్న ఎస్‌బీఐ తమ సర్వీస్ నిబంధనల విషయంలో స్పష్టతను ఇవ్వకుండానే, ఐచ్చికాలను 15 రోజులలో సమర్పించాలని ముంబాయి ఎస్‌బీఐ కార్పొరేట్‌ కేంద్రం సీజీఎం ఈ ఏడాది మార్చి 29న లేఖ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. ఎస్‌బీఐలో విలీనమైన అనుబంధ బ్యాంకుల అధికారులు, సంఘం ప్రధాన కార్యదర్శితో పాటు బ్యాంకు ఉద్యోగులు ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి... ఉద్యోగులు ఎవరైనా ఐచ్చికాలు ఇచ్చి ఉంటే వాటిని జూన్ 15 వరకు ఖరారు చేయకూడదని ఏప్రిల్ 13 న ఎస్‌బీఐ యాజమాన్యాన్ని ఆదేశించారు. దీనిని ఎత్తివేయాలని కోరుతూ ఎస్‌బీఐ అధికారులు అనుబంధ వ్యాజ్యం దాఖలు చేశారు. ఎస్‌బీఐ తరపు న్యాయవాది బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ విలీనమైన బ్యాంకుల ఉద్యోగులకు లాభం చేకూర్చే విధంగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని అన్నారు. మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఎస్‌బీఐ లో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని ఆయన కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న న్యాయమూర్తి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు. అంతేకాకుండా టెర్మినల్ బెనిఫిట్స్ , ఉద్యోగులకు రావాల్సిన ఇతర మొత్తాలకు సంబంధించి ఎస్‌బీఐ తో సంప్రదింపులు చేసుకునే అవకాశాన్ని విలీన బ్యాంకుల ఉద్యోగులకు ఆయన కల్పించినట్టు బ్యాంకు తరపు న్యాయవాది పేర్కొన్నారు.