జీఎస్టీ నుంచి మినహాయించండి : జగన్

SMTV Desk 2017-06-24 13:57:56  Central minister Arunjaitli, GST, YSRCP President Jagan Mohan Reddy, Chillapalli Mohan Rao

విజయవాడ, జూన్ 24 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా భావించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) జూలై నెల 1 నుంచి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జీఎస్టీ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇవ్వాలని విన్నవిస్తూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైకాపా) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది చేనేత రంగంపై ఆధారపడి, జీవనం కొనసాగిస్తున్నారని జగన్ గుర్తుచేశారు. టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా నాలుగున్నర కోట్లు, పరోక్షంగా ఆరు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, చేనేత రంగంపై జీఎస్టీ భారాన్ని వేసినట్లయితే శ్రామికులపై తీవ్ర ప్రభావం చూపుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వస్త్ర వ్యాపారులు మూడు, నాలుగు శాతం లాభాలను పొందితే జీఎస్టీ వల్ల అధిక శాతం పన్ను భారం పడే అవకాశాలు ఉన్నందున దుకాణాలను సైతం మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందనే కారణంతో వారు ఆందోళన చెందుతున్నారని ఆయన వివరించారు. పెరిగిన రసాయనాలు, నూలు ధరలతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న చేనేత రంగం జీఎస్టీ పన్నులతో పూర్తిగా అంతరించిపోతుందని ఆయన అన్నారు. జీఎస్టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించినట్లయితే ఉత్పత్తులు మరింతగా పెరిగే ఆస్కారముందని, కార్మికులకు ఊరట కలుగుతుందని జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు వైకాపా చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్ రావు విజయవాడలో మీడియాకు తెలిపారు.