నవ భారత్ స్వప్నం సాకారం దిశగా కృషి : రాష్ట్రపతి

SMTV Desk 2018-01-29 12:54:41  budjet session 2018, parliament, president ramnath kovind.

న్యూఢిల్లీ, జనవరి 29 : నవ భారత్ స్వప్న౦ సాకారం చేసుకునే దిశగా అందరు కృషి చేయాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. నవ భారత్ కల సాకారానికి 2018 వ సంవత్సరం గొప్ప అవకాశం అన్నారు. దేశంలో సామాజిక, ఆర్థిక సమానతకు సర్కార్ కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. దేశాన్ని 2019 వరకు స్వచ్ఛ దేశంగా మారుద్దామని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. అలాగే ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనతో మహిళల కష్టాలకు చరమగీతం పాడినట్లయి౦దన్నారు. ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు 26 వారాల సెలవు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపి౦దన్న ఆయన.. బాలికల సంరక్షణ కోసం బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమం అమలు చేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గించి దిగుబడి పెంచడమే లక్ష్య౦గా పనిచేస్తున్నామని, సాగునీటి పారుదల వ్యవస్థను విస్తరించి రైతులకు చేయూతనిస్తామని పేర్కొన్నారు.