‘గాయత్రి’ ట్రైలర్ విడుదల...

SMTV Desk 2018-01-28 21:46:56  GAYATHRI, TRALER, MOHAN BABU, MANCHU VISHNU, MANOJ, MADAN,

హైదరాబాద్‌: ‘దేవుడు చాలా మంచి వాడు రాక్షసులకు కూడా వరాలు ఇస్తుంటాడు’ అని అంటున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్‌ రామిగాని దర్శకత్వంలో మంచు విష్ణు, శ్రియ, అనసూయ భరద్వాజ్‌, నిఖిలా విమల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ రోజు చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను చిత్రం బృందం విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం మోహన్ బాబు తన డైలాగ్స్ తో పూర్వ వైభవాన్ని గుర్తుచేశారు. చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి పాత్రలో ఆయన కనిపించారు. న్యాయమూర్తిగా కోటా శ్రీనివాసరావు తీర్పు చెబుతున్న సంభాషణలతో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘అది వదలే రకం కాదు.. నేను దొరికే రకం కాదు’, ‘అక్షరాలు లేని స్వచ్ఛమైన భాష నవ్వు’, ‘రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది.. భారతం ఒక ఆడదాని నవ్వు వల్ల జరిగింది.’ ‘ప్రాణం ఇచ్చే పంచభూతాలు రెండో పేజీ ఓపెన్‌ చేస్తే ప్రళయ తాండవమే వస్తుంది’, ‘ఈ గాయత్రి పటేల్‌ ప్రతీ పేజీ క్రైం పేజీరా’, అంటూ మోహన్‌బాబు పలికే సంభాషణలు సినిమా పై ఆసక్తి రేపుతున్నాయి. ‘కత్తో.. కర్రో పట్టుకుంటే ఎవడైనా రౌడీ కావచ్చు. కానీ, నటుడు అందరూ కాలేరు’ అంటూ శ్రియ, ‘నేను వెయ్యరాని పాత్ర వేస్తున్నానో, చెయ్యరాని తప్పు చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు’ అంటూ విష్ణు, పలికిన డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌పై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్‌ స్వరాలు అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.