ఖరారైన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి

SMTV Desk 2017-06-23 15:17:49  Former Speaker Meira Kumar, Congress leader Sonia Gandhi, Ram Nath Kovind,Dalit community, delhi, 17 partys,

న్యూ ఢిల్లీ, జూన్ 23 : భారత దేశ రాష్ట్రపతి ఎన్నికలలో భాగంగా విపక్ష పార్టీలు లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన ఢిల్లీ లో గురువారం సాయంత్రం సమావేశమై మీరాకుమార్ ను అభ్యర్థిగా నిలబెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ప్రస్తుతం 17 పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నా, మరికొన్ని పార్టీలు సైతం తమకు మద్దతు తెలిపే అవకాశం ఉందని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి అభ్యర్థులుగా రెండు కూటముల తరపున దళితులే నిలబడుతుండడం విశేషం. ఈ సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థిగా దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ పోటీ చేస్తుండడంతో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైతం దళిత అభ్యర్థినే ఖరారు చేసింది. దళిత అభ్యర్థిని ఎన్డీఏ ఖరారు చేయటంతోనే బీఎస్సీ లాంటి పలు పార్టీలు తొలుత మద్దతు పలికాయి. కాంగ్రెస్ సైతం దళిత వ్యక్తినే అభ్యర్థిగా ఖరారు చేయడంతో తిరిగి నిర్ణయాన్ని మార్చుకుని మీరాకుమార్ కే మద్దతు తెలిపాయి. లోక్ సభ తొలి మహిళా స్పీకర్ గా పనిచేసిన మీరాకుమార్ ఇప్పుడు దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి కోసం రామ్ నాథ్ కోవింద్ తో పోటీ పడనున్నారు. బీహార్ గవర్నర్ గా పని చేసిన కోవింద్, అదే రాష్ట్రానికే చెందిన మీరాకుమార్ ల మధ్య గట్టి పోటీ నెలకొంటుందని నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు ఎన్సీపి, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎస్పీ, జేడీఎస్, జార్ఖండ్ ముక్తిమోర్చా తదితర పార్టీలు మీరాకుమార్ కు మద్దతు తెలిపాయి. మిగితా తటస్థ పార్టీలు మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా నిలిచాయి. సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 17 పార్టీలకు చెందిన 29 మంది ప్రతినిధులు హాజరయ్యారు.