లష్కర్ ఘాలో బాంబు పేలుడు

SMTV Desk 2017-06-23 13:27:59  Afghanistan,Terrorism,Bomb blast in car, Ramzan Festival

లష్కర్ ఘా, జూన్ 23 : ఆఫ్ఘనిస్థాన్ లోని లష్కర్ ఘా నగరంలో హఠాత్తుగా ఒక కారులో, బాంబు పేలుడు సంభవించడంతో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం హెల్మాండ్ రాష్ట్ర రాజధాని అయిన లష్కర్ ఘాలో రంజాన్ పండుగ సమీపిస్తుండడంతో, దేశ పౌరులతో పాటు పోలీసులు తమ వేతనాలను తీసుకోవడానికి ఒక బ్యాంకు వద్ద అధిక సంఖ్యలో బారులు తీరగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో 34 మంది మృతి చెందగా, 60 మంది క్షతగాత్రులయ్యారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిని పోస్టు మార్టం నిమిత్తం వైద్యశాలకు తీసుకెళ్లగా వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నట్లు బోస్ట్ ప్రభుత్వ వైద్యాధికారి ముల్లా దాదీ తాబిదర్ వెల్లడించారు. బ్యాంకు వద్దకు ఒకే సారి చాలామంది రావడంతో, ఇదే అవకాశంగా తీసుకొని తీవ్రవాదులే బాంబు పేలుడుకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించిన నేపథ్యంలో, ఇదే అదునుగా భావించి తాలిబన్లు విరుచుకుపడ్డారని అనుమానిస్తున్నారు. కాని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందో తెలియరాలేదని పోలీసులు తెలిపారు.