ఏకీకృత సర్వీసు పై రాష్ట్రపతి ఆమోదం

SMTV Desk 2017-06-23 13:11:51  Uniform service provision of teachers, Government, Panchayati Raj, Teachers Presidential Order,Central government, pranab mukarji, kcr, rajnathsing, modi, telangana, ap, delhi

హైదరాబాద్, జూన్ 23 : తెలంగాణ రాష్ట్రం లో టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనల సమస్య పరిష్కారానికి ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ప్రభుత్వం, పంచాయతీరాజ్, ఉపాధ్యాయులకు ఒకే రకమైన సర్వీసు నిబంధనలు ఉండేలా గతంలోని రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం రోజున ఆమోదం తెలిపారు. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన గెజిట్ విడుదల కానుందన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రధానికి గతంలో లేఖలు రాయడంతో పాటు పలు సందర్భాల్లో నేరుగా విజ్ఞప్తి చేసి, త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏకీకృత సర్వీసు నిబంధనలకు సంబంధించి 1998 నుండి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వరుస కేసుల విచారణల నేపథ్యంలో పరిష్కారానికి తీవ్రజాప్యం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సమ్మతితో కేంద్రం చొరవ తీసుకొని రాష్ట్రపతి ఆమోదానికి కృషిచేయాలని ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి లు ఏకాభిప్రాయాన్ని సాధించారు. ఈ సవరణలతో తయారైన నోట్ పై కేంద్ర హోం మంత్రి గత వారం సంతకం చేసి, ప్రధానమంత్రి కార్యాలయానికి పంపగా మంగళవారం ప్రధాని మోదీ సంతకం చేశారు. తరువాత ప్రధాని కార్యాలయం నుంచి హోం శాఖ ద్వారా ఈ ఫైల్ బుధవారం రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ఫైల్ మీద సంతకం చేశారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గత నెల రోజులుగా ఈ ఫైల్ కు సంబంధించిన ప్రతి కదలికను ఎంపీలు పర్యవేక్షిస్తూ వచ్చారు. దీనికి తోడు పీఆర్డీయూ ప్రతినిధులు ఇటీవల వెంకయ్యనాయుడును కలిసినప్పుడు కూడా ఆయన స్వయంగా రాజ్ నాథ్ సింగ్ తో ఫోన్ లో మాట్లాడి, ఆ తర్వాత అధికారులతో సంప్రదింపులు జరిపి రాష్ట్రపతి భవన్ కు ఫైల్ ను పంపడంలో చొరవ తీసుకున్నారు. తెలంగాణ తరపున సమిష్టిగా జరిగిన కృషి కారణంగా ఎట్టకేలకు ఈ సమస్యకు పరిష్కారం లభించిందని ఇరు రాష్ట్రాల నాయకులు భావిస్తున్నారు.