కొత్త టెక్నాలజీతో మేడారం జాతరలో బందోబస్తు..

SMTV Desk 2018-01-22 15:43:02  medaram jathara, new technology, drones, croud counting, bhupalapally.

భూపాలపల్లి, జనవరి 22 : ఆదివాసీ మహా జాతర హైటెక్ హంగులు అద్దుకుంటో౦ది. కోటిమందికి పైగా భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు పోటెత్తనుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి. క్రౌడ్ కౌంటింగ్, క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలతో పాటు, తప్పిపోయినవారి వివరాలను ఫొటోలతో తెలిపేందుకు వీఎంఎస్ బోర్డులను పోలీసులు జాతరలో ఏర్పాటుచేస్తున్నారు. గగనతల వీక్షణకు డ్రోన్ కెమెరాలు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు యాప్‌లు, వెబ్‌సైట్లు సిద్ధం చేశారు. ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం... క్రౌడ్ డిటెన్షన్ కెమెరాలు ఎక్కడైనా భక్తులు పెద్దసంఖ్యలో గుమిగూడినా, నిలిచిపోయినా క్రౌడ్ డిటెన్షన్ కెమెరాలు గుర్తించి కంట్రోల్‌రూమ్ ద్వారా సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఎక్కడైనా వెయ్యిమంది నిలిచినట్లు కెమెరా గుర్తించగానే ఆ ప్రదేశం వివరాల్ని కంట్రోల్‌రూమ్‌కు చేరవేస్తుంది. దీంతో అక్కడి అధికారులు సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తారు. వారు అక్కడికి చేరుకుని వారిని అక్కడినుంచి ముందుకు నడిపిస్తారు. వెనుకాల వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలు జాతరలో అమ్మవారి గద్దెల ప్రాంగణంలో తొక్కిసలాటకు తావులేకుండా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఆరు క్యూలైన్ మానిటరింగ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి గద్దెల వద్దకు భక్తులు వెళ్లే సమయంలో వాళ్లను లెక్కించి.. కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. నిర్దేశిత సమయంలోగా వాళ్లు బయటకు వెళ్లారా లేదా..? అన్నది ఎగ్జిట్‌లో ఉన్న కెమెరాలు పరిశీలిస్తాయి. అయితే, ఈసారి యాప్ రూపంలో బుకింగ్‌కు రెవెన్యూ శాఖ అవకాశం కల్పించింది. హైదరాబాద్‌నుంచి ఒక్కొక్కరికీ రూ.12,999 చార్జీ వసూలు చేస్తుండగా, మేడారం నుంచి జాతర పరిసరాల్ని వీక్షించేందుకు ఒక్కొక్కరికీ రూ.2,499 వసూలు చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మేడారం యాప్‌లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. దీనితోపాటు జాతరకు సంబంధించిన పూర్తి రూట్‌ మ్యాప్‌ను యాప్‌లో ఏర్పాటుచేశారు. జాతరలో జంపన్నవాగు ఎక్కడ ఉంది..? అక్కడినుంచి గద్దెల ప్రాంగణానికి ఎలా వెళ్లాలి..? తిరిగి బస్టాండ్ కాంప్లెక్స్‌కు ఎలా చేరుకోవాలో తెలిపే మ్యాప్‌ను ఏర్పాటు చేశారు. 200 సీసీటీవీ కెమెరాలు సమ్మక్క సారలమ్మ మహా జాతరకు పోలీసు శాఖ గద్దెలకు 10 కిలోమీటర్ల రేడియస్‌లో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు అమర్చారు.