ఏకకాలంలో ఎన్నికలను సమర్ధించిన ప్రధాని మోదీ

SMTV Desk 2018-01-20 14:08:45  modi, simultaneously elections, g news, interview, pm

న్యూ డిల్లీ, జనవరి 20: పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టిగా సమర్థించారు. జీ న్యూస్‌ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. తనపై వస్తున్న విమర్శలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరుపైనా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. "2019 ఎన్నికల గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోను. 125 కోట్ల మంది ప్రజల గురించే నేను ఆలోచిస్తాను. ఎన్నికలు పండుగలా ఉండాలి. ఉదాహరణకు హోళీ పండుగ రోజు చల్లుకున్నట్లు రంగులు చల్లుకోవాలి. అది ఆ ఒక్క రోజు వరకే. ఆ తర్వాత వచ్చే ఏడాది వరకూ ఆ విషయం మరిచిపోతాం. ప్రస్తుతం దానికి భిన్నంగా.. దేశంలో ఎప్పుడూ ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ఒక ఎన్నిక పూర్తవగానే మరొకటి మొదలవుతోంది. ప్రతీ ఐదేళ్లకోసారి ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్ని ఒక నెల లేదా కొంత వ్యవధిలో పూర్తి చేస్తే భారీగా డబ్బు, వనరులు, శ్రమను ఆదా చేయగలం" అని మోదీ చెప్పారు. "విమర్శలకు ఎప్పుడూ భయపడొద్దు. అదే ప్రజాస్వామ్య బలం. ప్రతి అంశాన్నీ విశ్లేషించుకోవాలి. మంచి పని చేసినపుడు ప్రశంసించాలి. లోపాలు కనిపించినపుడు విమర్శించాలి. కానీ కొన్ని సార్లు విమర్శలు పరిధి దాటిపోతున్నాయి. ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. దేశం ఇంకా జీడీపీ, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, స్టాక్‌ మార్కెట్‌ గురించి చర్చించటం గొప్ప విషయం. అభివృద్ధి ఒక్కటే మా ప్రభుత్వ లక్ష్యం. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ మా మంత్రం. అది మొదటి బడ్జెట్‌ అయినా ఐదో బడ్జెట్‌ అయినా.. ఎన్నికలున్నా, లేకున్నా ఒకే విధంగా వ్యవహరిస్తాం. నా స్నేహశీలత, నిష్కపటత్వమే ప్రపంచ దేశాల అధినేతలకు నచ్చింది. ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవటమే నా మనస్తత్వం. నేను ప్రధానిగా ఎన్నికవగానే.. చాలా మంది నాకు గుజరాత్‌ బయట ఏముందో తెలియదని విమర్శించారు. ఏమీ తెలియకపోవటమే నాకు బలంగా మారింది. ప్రపంచదేశాల సరసన నిలబడినపుడు నేను నరేంద్ర మోదీ అనే విషయం మరిచిపోతాను. 125 కోట్ల ప్రజల ప్రతినిధిగానే భావించుకుంటాను" అని మోదీ పేర్కొన్నారు.