ఢిల్లీకి కేసీఆర్

SMTV Desk 2017-06-22 12:20:24  delhi, telangana cm kcr, President of the BJP Nominee Ram Nath Kovind nominees, gst, pranab mukharji

హైదరాబాద్, జూన్ 22 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పది రోజుల పర్యటన కోసం బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ కి బయల్దేరి వెళ్లారు. ఈ నెల 23న బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేయనుండటంతో, ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెడతామని ప్రతిపక్షాలు ప్రకటించడంతో ఈ మేరకు సీఎం కేసీఆర్ ఢిల్లీ లోనే పది రోజుల పాటు ఉండనున్నారు. పార్టీ ఎంపీలకు రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు కొత్త సచివాలయ నిర్మాణానికి బైసన్ పోలోగ్రౌండ్, జింఖానాగ్రౌండ్ లను ఇవ్వడానికి ఇప్పటికే కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో కేటాయింపు ప్రక్రియను రాష్ట్రపతి ఎన్నికల్లోనే పూర్తయ్యేలా మంత్రాంగం నడిపించనున్నట్లు సమాచారం. స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వం కోరిందని, దీనిపై కేంద్రం అనుకూలంగా ఉన్నప్పటికీ రక్షణశాఖ అధికారులు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ అంశాలపై కేటాయింపులు పూర్తయ్యేలా చూడనున్నారని, ఈ నెల 30న జరిగే జీఎస్టీ ప్రారంభ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశాలున్నాయని సమాచారం. ప్రధానంగా జీఎస్టీని తొలుత అసెంబ్లీలో ఆమోదించిన రాష్ట్రంగా తెలంగాణ ముందుండటంతో దీనికి ప్రతిఫలంగా మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులు, బీడీ, గ్రానైట్‌ పరిశ్రమలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరే అవకాశం ఉందని వెల్లడించారు. వచ్చే నెలలో ప్రణబ్ ముఖర్జీ పదవికాలం పుర్తికానుండటంతో, ఆయన పదవికాలంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏకీకృత సర్వీసు రూల్స్ తో పాటు 371(డీ)ని సవరించాలని రాష్ట్రపతిని కోరే అవకాశాలున్నాయి. దాంతో పాటు కంటికి ఆపరేషన్ కూడా చేయించుకుంటారని సమాచారం.