సుప్రీంకోర్టు తీర్పుతో ఈ నెల 25న దేశవ్యాప్తంగా "పద్మావత్" విడుదల

SMTV Desk 2018-01-18 13:47:30  Supreme Court judgement, padmavath movie

ముంబయి, జనవరి 18 : సర్వోన్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఐదు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా "పద్మావత్" చిత్రం ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ ఇచ్చినప్పటికీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు సినిమా విడుదలపై నిషేధం విధించాయి. దీంతో ఈ నెల 17న సెన్సార్‌ బోర్డు అనుమతిచ్చాక సినిమాను అడ్డుకునే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని తమ సినిమా అన్ని రాష్ట్రాల్లోనూ విడుదలయ్యేలా చూడాలని నిర్మాతలు పిటిషన్‌ వేశారు. ఈ మేరకు సుప్రీం నేడు తీర్పునిస్తూ ఐదు రాష్ట్రాల్లో సినిమాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది. దాంతో భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరించిన ఈ సినిమాలో దీపిక పదుకొణె రాణి పద్మావతి పాత్రలో నటించారు. పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌ కనిపించనున్నారు.