హజ్‌ రాయితీ ఉపసంహరణ: కేంద్రం

SMTV Desk 2018-01-17 14:33:50  huj, subsidy, withdrawal, central govt, mukhar abbas nakhwi

న్యూ డిల్లీ, జనవరి 17: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హజ్‌ యాత్రికులకు ఇచ్చే రాయితీని ఉపసంహరించాలని నిర్ణయించినట్లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు. ఆ రాయితీ నగదును మైనార్టీల సంక్షేమానికి ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతేడాది 1.25లక్షల మంది యాత్రికులు హజ్‌ వెళ్లారని, భారత్‌ నుంచి మొదటిసారిగా ఈ ఏడాది 1.75లక్షల మంది యాత్రికులు ఎటువంటి రాయితీ లేకుండా హజ్‌ యాత్రకు వెళ్తున్నట్లు ఆయన వివరించారు. రాయితీని ఉపసంహరించుకోవడం వల్ల ప్రభుత్వానికి రూ.700కోట్లు ఆదా అవుతుందని, ఈ రాయితీ మొత్తాన్ని ముస్లిం బాలికల విద్యకు ఉపయోగించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. సముద్ర మార్గం ద్వారా కూడా యాత్రికులు హజ్‌ చేరుకునేందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించిందని, ఈ రాయితీ వల్ల ముస్లిం ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆయన చెప్పారు. ఈ ఏడాది దాదాపు 1300 మంది మహిళలు పురుషుల తోడు (మెహ్రం) లేకుండా హజ్‌ యాత్రకు వెళ్తున్నారు. వీరి గురించి ప్రధాని మోదీ ఇటీవల మాట్లాడిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలోనూ ప్రస్తావించారు.