హైదరాబాద్ లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్...

SMTV Desk 2018-01-12 13:04:34  it congress, meeting held on feb 19 to 21, minister ktr.

హైదరాబాద్, జనవరి 12 : నగరంలో మరో అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సమావేశాన్ని ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ (డబ్ల్యూసీఐటీ) హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశ నిర్వాహణపై సంబంధిత అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. "ప్రధానమంత్రి మోదీని ఈ సదస్సును ప్రారంభించడానికి ఆహ్వానించనున్నామని తెలిపారు. నాస్‌కామ్‌, తెలంగాణ ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. పాతికేళ్లుగా ముంబయిలో మాత్రమే నిర్వహిస్తున్న ఈ నాస్‌కామ్‌ సదస్సును తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ రెండు సదస్సులు ఒకేసారి హెచ్‌ఐసీసీలో జరుగనున్నాయి. ఐటీ రంగంలో వస్తున్న మార్పులపై ప్రభుత్వ ప్రతినిధులు సదస్సుకు హాజరై అవగాహన కల్పిస్తారని, సుమారు 30 దేశాలకు చెందిన ప్రతినిధులు మొత్తం 2,500 మంది హాజరుకావచ్చని తెలిపారు. సదస్సుకు హాజరైన అతిథులకు రామోజీ ఫిలింసిటీ, చార్మినార్‌ తదితర ప్రదేశాలతో పాటు హైదరాబాద్‌ అతిథ్యాన్ని రుచి చూపిస్తామన్నారు. అంతేకాకుండా సదస్సులో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటిస్తుందని కేటీఆర్‌ వెల్లడించారు.