అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మోదీ

SMTV Desk 2017-06-21 14:17:18  yoga celebrations, lakhnav utharapradesh, narendra modi, adhithyanath, june 21, peoples

లఖ్ నవూ , జూన్ 21 : నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 150 దేశాలు యోగా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాయి. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్ లో తీర్మానించిన విషయం తెలిసిందే. భారతదేశంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఈ సారి ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్ నవూలోని రమాబాయ్ అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ యోగా చేయడం ద్వారా మానసిక, శారీరక వికాసం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరైన ఔత్సాహికులతో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. లఖ్ నవూలో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికి వర్షంలోనే మోదీ, ప్రముఖులు, ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. దీంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యోగా చేసిన ప్రతి ఒక్కరికీ మోదీ అభినందనలు తెలిపారు. ఈ యోగా ఉత్సవంలో పాల్గొన్న ప్రజలు తమ అనుభవాలను పంచుకునేందుకు కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ సెలబ్రేటింగ్ యోగా పేరిట ఉన్న యాప్ ను ఆవిష్కరించారు. యోగా అభివృద్ధికి, ప్రోత్సాహానికి కృషి చేసిన వారికి అందించే అవార్డు కోసం 85 నామినేషన్లు వచ్చాయని, వాటిలో పదిహేనింటిని స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డుకు పుణేలోని రమామణి అయ్యంగార్ స్మారక యోగా సంస్థ ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు.