ఇస్రో@ 100.. పీఎస్ఎల్‌వీ-సి40 సక్సెస్

SMTV Desk 2018-01-12 11:00:57  isro, 100 sattilite , pslv c 40, record, success, cartosat-2

శ్రీహ‌రికోట, జనవరి 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అరుదైన‌ ఘనతను సాధించింది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి వందో ఉప‌గ్రహాన్ని విజ‌య‌వంతంగా క‌క్ష్యలోకి ప్రవేశ‌పెట్టింది. నేడు ఉదయం 9.29 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్ర‌వేశ‌పెట్టింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తరలించిన ఘనత ఇస్రో సొంతం. ఆ ప్రయోగంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. 2013లో అమెరికా 29, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను భారత్‌ బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డుకు చేరుకుంది. అయిదేళ్లు పనిచేసే ఈ ఉపగ్రహంతో మన పొరుగు దేశాలపైనా నిత్యం నిఘావేసి ఉంచే సదుపాయం కలుగుతుంది. ‘కార్టోశాట్‌-2’ హై రిజల్యూషన్‌ డేటాను అందిస్తూ పట్టణ, గ్రామీణ ప్రణాళిక, తీర ప్రాంత వినియోగం, రోడ్డు నెట్‌వర్క్‌ పర్యవేక్షణ, నీటిపంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌ల తయారీ, భౌగోళిక, మానవ నిర్మిత అంశాల్లో మార్పు పరిశీలన వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.