ఇస్రో కొత్త చైర్మన్‌గా కె శివన్...

SMTV Desk 2018-01-11 15:07:42  isro, new chairman, shivan

న్యూ డిల్లీ, జనవరి 11: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం కొత్త చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త కే శివన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఏ ఎస్ కిరణ్‌కుమార్ స్థానంలో శివన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతరిక్ష శాఖ కార్యదర్శి పదవితోపాటు అంతరిక్ష కమిషన్ చైర్మన్‌గా శివన్‌ పేరు ఖరారు చేస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌గా ఉన్న శివన్ ఇస్రో చైర్మన్‌గా మూడేళ్లు ఆ పదవిలో కొనసాగుతారు. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన తర్వాత 1982లో ఐఐఎస్సీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన ఏడాదే ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. పీఎస్ఎల్వీ ప్రాజెక్టుల్లో శివన్ కీలక పాత్ర పోషించారు. 2015 నుంచి వీఎస్ఎస్‌సీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇస్రోలో చేరిన తర్వాత వివిధ హోదాలో పనిచేసిన ఆయన, చైన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను పొందారు. జనవరి 14 న ఇస్రో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. తనకు ఇస్రో చైర్మన్ పదవి కట్టబెట్టడంపై శివన్ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించి గౌరవించారని, ఇస్రోను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తానని శివన్ పేర్కొన్నారు.