ఆధార్ అనుసంధానం అవాస్తవం : నోరోన్హా

SMTV Desk 2017-06-20 19:39:45  Land records, Digitalisation, Aadhaar card, Central government, Principal Director General of Press Information Bureau, Frank Frank Noronha

న్యూ ఢిల్లీ, జూన్ 20 : భూమి రికార్డులను డిజిటలైజ్‌ చేసి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులివ్వలేదని కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఫ్రాంక్‌ నొరోన్హా తెలిపారు. ఈ విషయమై క్యాబినెట్ సెక్రటేరియట్ నుంచి వెలువడినట్టుగా చెప్తున్న లేఖ తాము విడుదల చేయలేదంటూ దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 1950 నుంచి అన్ని భూమి రికార్డులు, మ్యుటేషన్ రికార్డులు, అమ్మకం-కొనుగోళ్ల వివరాలు, భూమి సహా స్థిరాస్తుల వివరాలన్నీ వచ్చే ఆగస్టు 14లోగా డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించినట్టు తెలిపే లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖలోనే భూమి రికార్డులన్నీ ఆధార్‌తో అనుసంధానం చేస్తారని ఉన్నది. అయితే ఆ లేఖ బూటకమని, దానిపై చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం యోచిస్తుందని జూన్‌ 15 తేదీతో వెలువడిన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు తప్పుడు లేఖను ప్రచారంలోకి తెచ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించారు.