సంపదలో బిల్‌ గేట్స్‌ను దాటేసిన జెఫ్ బెజోస్!

SMTV Desk 2018-01-09 17:10:27  billgates, jef bejos, amazon, wealth, increase

న్యూయార్క్‌, జనవరి 09: ప్రపంచ కుబేరుడు అనగానే గుర్తువచ్చే ప్రముఖ వ్యక్తి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. కానీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌ షేర్లు 12 నెలల గరిష్టస్థాయికి పెరగడంతో ఆ సంస్థ అధిపతి జెఫ్‌ బెజోస్‌ సంపద 10,500 కోట్ల డాలర్లకు పెరిగింది. బెజోస్‌ సంపద భారీగా పెరగడంతో 1999లో బిల్ గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ చేరుకున్న గరిష్ట మార్కెట్‌ విలువను అధిగమించి సంపదలో ఆయనను దాటేసారు. ఈ ఏడాది అమెజాన్‌ షేర్లు 6.6 శాతం ఎగిసి, మార్కెట్‌ విలువ 57 శాతం పెరిగింది. అమెరికాలో థ్యాంక్స్‌గివింగ్‌ డే అనంతరం అయిదు వారాల వ్యవధిలో ఆన్‌లైన్‌ స్పెండింగ్‌ మార్కెట్‌లో అమెజాన్‌ ఏకంగా 89 శాతం మార్కెట్‌ షేర్‌ను దక్కించుకోవడం విశేషం. బిల్‌ గేట్స్‌ తన సంపదలో అధిక భాగాన్ని బిల్‌ అండ్‌ మిళిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు ఇవ్వకుంటే ఆయన నికర సంపద 15,000 కోట్ల డాలర్లు దాటేదని నిపుణులు పేర్కొంటున్నారు. 1996 నుంచి గేట్స్‌ 70 కోట్ల మైక్రోసాఫ్ట్‌ షేర్లు, 300 కోట్ల డాలర్ల నగదు సహా పలు ఇతర ఆస్తులను బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చారు.